మండలి చీఫ్ విప్​గా మహేందర్ రెడ్డి .. నియామకం రాజ్యాంగ విరుద్ధం

మండలి చీఫ్ విప్​గా మహేందర్ రెడ్డి .. నియామకం రాజ్యాంగ విరుద్ధం
  • పీఏసీ చైర్మన్ విషయంలోనూ ఇట్లనే వ్యవహరించిన ప్రభుత్వం: హరీశ్ రావు 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నదని, చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీని ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎలా నియమిస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. ‘‘మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ జారీ చేస్తారు? అధికార పార్టీ సభ్యులకా? ప్రతిపక్ష పార్టీ సభ్యులకా?. ఆయన విప్ జారీ చేస్తరా? లేక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విప్ ను పాటిస్తారా? బీఆర్ఎస్ పార్టీ విప్ ప్రస్తుత చీఫ్ విప్ కు విప్ జారీ చేసే పరిస్థితి వచ్చింది” అని అన్నారు. ‘‘శాసనసభ సమావేశాలు ముగిసే నాటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 అని స్పీకరే చెప్పారు. కానీ ఇప్పుడు కొందరిని మావాళ్లు కాదని చెబుతున్నారు. మండలి చైర్మన్ దగ్గర మహేందర్ రెడ్డి అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉంది. ట్రిబ్యునల్ చైర్మన్ గా దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది పోయి.. మహేందర్ రెడ్డిని చీఫ్ విప్ గా నియమిస్తూ అదే కౌన్సిల్ చైర్మన్ బులెటిన్ ఎలా జారీ చేస్తారు? అనర్హత పిటిషన్ లో చైర్మన్ ఇచ్చిన బులెటిన్ కూడా ఇంప్లీడ్ చేస్తాం” అని తెలిపారు. పంద్రాగస్టు, సెప్టెంబర్ 17 సందర్భంగా ఇచ్చిన ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల్లో ఎమ్మెల్సీ అని పేర్కొని.. చీఫ్ విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డిని నియమిస్తూ మార్చి 15వ తేదీతో బులెటిన్ జారీ చేయడం దారుణమన్నారు. పీఏసీ చైర్మన్ పదవి విషయంలో ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందని మండిపడ్డారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారని.. మరి మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తో చెప్పాలని డిమాండ్ చేశారు.